
ఎన్నేళ్ళో వేచిన ఉదయం... ఎదురైంది. మీరు సరిగ్గానే చదివారు. ఎన్నాళ్ళో కాదు. నేను రాసింది ఎన్నేళ్ళో అనే.
ఒకటి కాదు రెండు కాదు, పదకొండు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. విషయం చెప్పకుండా ఏంటీ సుత్తి అనుకుంటున్నారా? ఆ సంగతికే వచ్చేస్తున్నా.
1999 జూలైలో నాకు మా బాబాయి The Adventures of Pinocchio అనే పుస్తకం ఇచ్చి చదవమన్నాడు. అప్పటి దాకా, నాకు పినోకియో గురించి తెలియదు. పుస్తకం చదవడం మొదలు పెట్టాకా, ఆగకుండా చివరిదాక చదివేసాను. నాకెంతో నచ్చింది. దాన్ని అనువదిస్తే బాగుంటుందనిపించింది. అనువాద రంగంలో ప్రవేశానికి అది నాలో బీజం వేసింది. ఆంగ్ల పుస్తకం ప్రచురణకర్తతో అనువాదం అనుమతి కొరకు సంప్రదింపులు జరిపాను. ఆ పుస్తకం ప్రచురించి వందేళ్ళు దాటి పోయిందని, అది కాపీరైట్ హక్కుల పరిధిలో లేదని, పారగాన్ పబ్లిషర్స్ వారు తెలియజేసారు. వారి జవాబందుకున్న వెంటనే నేను ఆ పుస్తకాన్ని అనువదించడం మొదలు పెట్టి అక్టోబర్ నాటికి పూర్తి చేసాను. అప్పటికే నేను బాలజ్యోతిలో దాదాపు 9 కథలు రాసి ఉండడంతో, ఈ చిన్న పిల్లల నవలికని సీరియల్‌గా వేస్తే బాగుంటుందని బాలజ్యోతి యాజమాన్యాన్ని సంప్రదించాను. కొద్ది విరామం అనంతరం వారు ఆ నవలికని సీరియల్‌గా వేయడానికి సమ్మతించి, 1999 డిసెంబరు సంచిక నుంచి ప్రచురణ ప్రారంభించాలని నిర్ణయించారు.
నా దురదృష్టమో ఏమో, డిసెంబర్ సంచిక వెలుగు చూడకముందే లాకౌట్ కారణంగా ఆంధ్రజ్యోతి సంస్థల ప్రచురణలన్నీ ఆగిపోయాయి. దినపత్రిక తిరిగి ప్రారంభమైనా, బాలజ్యోతి మాత్రం ఆగిపోయింది. కొన్ని నెలల తర్వాత బాలజ్యోతిలో పనిచేసిన ఉద్యోగులను సంప్రదించి, ఆ నవలికని మరో పత్రికలో ప్రచురణకి ఇవ్వచ్చా అని అడిగాను. వారు ఒప్పుకున్నాక, 2001లో ఈ పుస్తకాన్ని ఓ ప్రముఖ దినపత్రికలో పిల్లల పేజిలో సీరియల్‌గా ప్రచురించడానికి అవకాశం ఉందేమోనని అడగడానికి వెళ్ళి నా రాతప్రతిని ఇచ్చివచ్చాను. మళ్ళీ నన్ను దురదృష్టం వెంటాడింది. నా పుస్తకంపై నిర్ణయం తీసుకోడానికి వారికి చాలా కాలమే పట్టింది...అయిదున్నరేళ్ళు. వారు ఆ పుస్తకాన్ని ప్రచురించలేమని తెలియజేసాక, నా రాతప్రతి ఇచ్చేయమని అడిగాను. కానీ అది దొరకలేదు, వారి చుట్టూ తిరగగా, తిరగగా, చివరికి విసిగిపోయి రాత ప్రతుల కట్టలో లోంచి నా పుస్తకం వెతుక్కోమన్నారు. నేను దాన్ని వెతికి పట్టుకుని వెనక్కి తీసేసుకున్నాను. తర్వాత విజయవాడ నుంచి ప్రచురితమయ్యే బాలతేజం అనే చిన్నపిల్లల పత్రికకి పరిశీలనార్థం పంపాను. వారికి కథాంశం బాగా నచ్చి, వెంటనే డిటిపి చేయించుకుని ప్రచురణకు సిద్ధమయ్యారు. కాని అనుకోని అవాంతరం.. ఆర్ధిక ఇబ్బందుల వలన ఈ పత్రిక కూడా మూతపడింది. పత్రికా యజమాని తమ కుటుంబాన్ని విజయవాడ నుంచి పుట్టపర్తికి మార్చేసారు. నా రాతప్రతి ఆయన దగ్గర ఉండిపోయింది.
2006లో మనీప్లాంట్ ప్రచురణ తర్వాత నాకు అనువాదకుడిగా గుర్తింపు వచ్చాక, నేను వివిధ ప్రచురణ సంస్థలను అవకాశాల కోసం సంప్రదించాను. 2007 ఆగస్టులో అనుకుంటా, పీకాక్ క్లాసిక్స్ గాంధి గారి నుంచి నాకో మెయిల్ వచ్చింది, వచ్చి కలవమని. సంప్రదించాను. ఎటువంటి పుస్తకాలు అనువదించాలనుకుంటున్నారని గాంధి గారు అడిగినప్పుడు నాకు వెంటనే నా ఈ చిన్న పిల్లల నవలిక గుర్తొచ్చింది. నేను అప్పటికే అనువదించి ఉన్న ఆ పుస్తకం రాతప్రతి నకలుని ఆయనకి అందజేసాను. నా అనువాదం పట్ల ఆయన సంతృప్తి చెంది, నవలిక అసలు ప్రతి కావాలన్నారు. పుట్టపర్తిలో ఉంటున్న బాలతేజం సంపాదకులతో మాట్లాడి, నా రాతప్రతి తెప్పించుకుని గాంధి గారికి అందజేసాను.
ఆ తర్వాత ప్రచురణ రంగంలో కొంత సంక్షోభ సమయం. చివరగా ఇప్పటికి నా అనువాదం ప్రచురితమైంది. పీకాక్ క్లాసిక్స్ వారు పీచిక్స్ పబ్లికేషన్స్ పేరుతో నేను అనువదించిన "కొంటె బొమ్మ సాహసాలు" అనే ఆ పుస్తకాన్ని ప్రచురించారు. నా ఆనందం అంతా ఇంతా కాదు.
ఇంతటి ఆనందంలోను, కొంత బాధ కలిగింది. ఎందుకంటే పుస్తకం కవర్ పేజి మీద నా పేరు "కొల్లూరి సోమ శేఖర్" అని తప్పుగా ముద్రితమైంది. ఒక్క సారిగా అయ్యో అనుకున్నాను. ఎన్నో కాపీలు ముద్రించి ఉంటారు, నేనిక చేయగలిగిందేలేదని గ్రహించాను. లోపలి పేజిలో మాత్రం నా పేరు సరిగ్గానే ఉండడం కాస్త ఊరట కలిగించింది. పైగా కథలో అతి తక్కువ ముద్రాదోషాలు ఉండడంతో సంతోషించాను.
దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత, నా అనువాదం ప్రచురితమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. పీపుల్స్ ట్రస్ట్ వారికి బ్లాగ్ ముఖంగా నా కృతజ్ఞతలు. రూ.60/- ఖరీదున్న ఈ 128 పేజిల పుస్తకానికి పంపిణీదారులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోను లభిస్తుంది. మీరు చదవండి. మీ పిల్లల చేత చదివించిండి.