అనగనగా ఓ రాజు గారుండేవారు. ఆయనో సారి చిత్రలేఖనం పోటీలు నిర్వహించాడు. శాంతిని ప్రతిబింబించే ఉత్తమ చిత్రానికి తగిన బహుమతినిస్తానని ప్రకటించాడు. ఎందరో చిత్రకారులు ప్రయత్నించారు. కానీ రాజుగారు వాటన్నింటిని వడపోయగా తుది పోటీలో రెండే మిగిలాయి. ఆ రెండిటిలోంచి ఒకదాన్ని ఎంచుకోడంలో ఆయనకి ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే ఆ రెండూ ఆయనకి బాగా నచ్చేసాయి.
వాటిలో ఒకటి ప్రశాంతమైన సరోవరం బొమ్మ. పైన నీలాకాశం, తెల్లని మబ్బులు, చుట్టూ ఎత్తైన కొండలతో నిజమైన సరోవరాన్ని ప్రతిబింబిస్తోందా చిత్ర పటం. దాన్ని చూసిన వారంతా, ఆ చిత్రపటం అద్భుతమైన శాంతికి నిదర్శనమని భావించారు.
రెండో బొమ్మలో కూడా కొండలు ఉన్నాయి. కానీ అవి గరుకుగాను, ముతకగాను ఉన్నాయి. పైన ఆకాశం భీకరంగా ఉంది. భారీ వర్షం కురిసి ఆగినట్లుగా ఉంది, ఇంకో వైపు మెరుపులు! ఒక కొండ నుంచి ఉదృతంగా దూకుతున్న జలపాతం. ఈ చిత్రాన్ని చూస్తే ఎవరికీ శాంతి అనుభవంలోకి రాలేదు. అయితే రాజు గారు పటంలో జలపాతానికి కొద్దిగా వెనుకగా కొండ పగిలిన చోట ఓ పొద మొలిచి ఉండడం, ఆ పొదలో ఓ తల్లి పక్షి గూడు కట్టుకుని ఉండడం చూసారు. ఆ ఉదృతమైన జలపాతం హోరులో, తల్లి పక్షి తన గూటిలో కూర్చుని ఉంది...... ప్రశాంతంగా.
ఏ చిత్ర పటానికి బహుమతి వచ్చిందని మీరు ఊహిస్తున్నారు?
రాజు గారు రెండో చిత్రానికే బహుమతి ప్రకటించారు. కారణం తెలుసా? ఆయనే చెప్పారు - " ఎందుకంటే... శాంతి అంటే శబ్దాలు లేని చోట, ఇబ్బందులు లేని చోట, శ్రమ లేని చోట ఉండడం కాదు. శాంతి అంటే శబ్దాలున్న చోట, ఇబ్బందులుండే చోట, శ్రమ ఉన్న చోట ఉండి కూడా, హృదయంలో నిశ్ఛలంగా ఉండడం'' ఇదే నిజమైన శాంతి!
(గమనిక: ఇది నా సొంతం కాదు. సేకరణ మాత్రమే. నాకొచ్చిన ఈ-మెయిల్ ఫార్వర్డ్స్ లోంచి తీసుకుని, తెలుగు లోకి అనువదించాను)