Wednesday, April 16, 2008

యాభై ఒకటి

కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులోని టపాకి వ్యాఖ్య రాయాలని మొదలుపెడితే, నాదో టపా అయి కూర్చుంది.
సాధారణంగా ఒక కథ రాసి, పత్రికకి పంపించాక కనీసం నెలలపాటు ఎదురుచూడాలి. కొన్ని పత్రికలు రచనని స్వీకరిస్తే, ముందుగానే తెలియజేస్తాయి. ఇంకొన్ని మనం పోస్టుకార్డు జత చేస్తే, స్వీకరించినదీ లేనిదీ తెలియజేస్తాయి. కథని తీసుకున్నదీ లేనిదీ సాధారణంగా ఫోన్ల ద్వారా తెలియజేయరు. కాబట్టి వాళ్ళదో, మనదో పోస్టుకార్డే కథ స్టేటస్ తెలుసుకోడానికి సాధనం. పోస్టల్ డిలే కానీ, పోస్టులో మిస్యయ్యే ఉత్తరాల వల్లో కథలు ప్రచురణకి స్వీకరించారో లేదో తెలియడం ఆలస్యమయ్యేది. ఏమయితే అయిందిలే అని ఓ పత్రిక ఎడిటర్ గారికి రెండు సార్లు ఫోన్ చేసాను. ఆవిడ నాతో కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఇంకో పత్రిక నా కథని స్వీకరించామని తెలియజేసాక, ఆర్నెల్లయినా ప్రచురించకపోయేసరికి, నేనా పత్రికాఫీసుకి వెళ్ళి అడిగితే, కథ పోయిందని, మళ్ళీ ఇంకోసారి రాసివ్వమని అడిగారు. ఏం చేస్తామనుకుంటూ మళ్ళీ రాసిచ్చాను.
నేను పిల్లల కోసం అనువదించిన ఓ చిన్న నవలని ఓ పత్రిక దాదాపు ఆరేళ్ళు అట్టేపెట్టుకుంది. నేను అడగ్గా అడగ్గా చివరికి చిన్న పిల్లల పేజీలో మార్పులు చేసాం, సీరియల్ గా వేయడం కుదరదు అని సమాధానం చెప్పి నవలని తిరిగిచ్చేసారు. తర్వాత ఇంకో చిన్న పిల్లల పత్రికకి పంపాను. నా దురదృష్టం, ఆ పత్రిక మూత పడింది, ఆ నవల ఇప్పటికీ ప్రచురితమవలేదు. రాతప్రతి కూడ ఆ పత్రికాఫీసులోనే ఉండిపోయింది. ఈ సంఘటన గుర్తొచ్చినప్పడల్లా బాధేస్తుంది.
కొత్త రచయితలు, వర్ధమాన రచయితలు ఎదుర్కునే ఇబ్బందుల్లో కొన్ని మాత్రమే మురళిగారు ఉదహరించారు. వాటన్నింటిని తట్టుకుని రాయగలడం కష్టమే. రాసిన వాటిని ప్రచురింపజేసుకోడం మరీ కష్టంగా ఉండేది. అయితే ప్రపంచానికి కావలసింది ఫలితమే, అందుకు పడ్డ శ్రమ కాదు. 'పురిటి నొప్పుల గురించి చెప్పకు, బిడ్డని చూపించు' అనే సామెత ఉంది. అది రచయితల కూడా వర్తిస్తుంది.
నేను అనువాదాలు మొదలుపెట్టిన రోజులలో అనువాదాలను అన్ని పత్రికలూ ప్రచురించేవి కావు. ఆంధ్రప్రభలో విశ్వకధంబం అనే శీర్షిక, విపుల మాసపత్రికి మాత్రమే అనువాదాలను ప్రచురిస్తుండేవి. మిగతా పత్రికలు అప్పుడప్పుడు ఒకటో అరో అనువాదాలను ప్రచురించేవి. దానికి విరుగుడుగా మంచి కథలను అనువాదాలకి ఎంచుకోవాలి ఆని నిశ్చయించుకుని, కథలను ఎంపిక చేసుకోడంలో జాగ్రత్త వహించాను. కథ ఇస్తే తిరగ్గొట్టడానికి వీలు లేని కథలను అనువాదాలకు ఎంచుకున్నాను. క్రమేపి 2006 నుంచి అన్ని పత్రికలు అనువాదాలను ప్రచురించసాగాయి. దాంతో నాకు అవకాశాలు పెరిగాయి. నేను అనువాదాలు మొదలుపెట్టి దాదాపు ఆరేళ్ళు అవుతోంది. హిందీ, ఇంగ్లీషు భాషలలో ఎన్నో కథలని చదివాను. రాశికన్నా వాసి ముఖ్యమని భావించి, నేను చాలా కథలను వదిలేసాను. మొదటిసారి చదివినప్పుడు, నాల్లోసారి చదివినప్పుడు ఆ కథ నాకు ఒకే రకమైన స్పందన కలిగిస్తే, ఆ కథని నేను అనువదించాలని నిశ్చయించుకుంటాను. ఈ ఆరేళ్ళలో ప్రచురితమైన నా అనువాదాల సంఖ్య 51.


కథలు ప్రచురితమయ్యాక, అంతకు ముందు పడ్డ కష్టాలన్నీ తాత్కాలికంగా నైనా మరచిపోతాం. ఈ యాభై ఒకటి కథలను ప్రచురించిన పత్రికలకు,వెబ్‌జైన్లకు నా కృతజ్ఞతలు.

ఇక నా మనీ ప్లాంట్ పుస్తకం విషయానికొస్తే 500 కాపీలు వేసాను. దాదాపు 150 కాంప్లిమెంటరీగా ఇవ్వాల్సివచ్చింది. దాదాపు 50 పుస్తకాలు నేను వ్యక్తిగతంగా అమ్మాను. వివిధ పుస్తక కేంద్రాలలో ఓ 100 కాపీలున్నాయి. మిగిలినవి గూటిలో మూలుగుతున్నాయి. ఆర్ధికంగా బాగా నష్టం కలిగించినా, అనువాదకుడిగా స్థిరపడడంలో ఆ పుస్తకం ఉపయోగపడింది.
మురళీగారు మెన్షన్ చేసిన ఇబ్బందుల దృష్టిలో పెట్టుకుని చూస్తే మొదటి మూడేళ్ళు కష్టపడ్డా ఆ తర్వాత నా ప్రస్థానం బాగానే సాగుతోంది. ఇదంతా నా సొంత డబ్బాలా అనిపించచ్చు. నేనేదో సాహిత్యాన్ని ఉద్ధరిస్తునానన్న భ్రమలు నాకు లేవు. నాకు నచ్చిన కథలను మిగతా పాఠకులతో పంచుకోడానికే నేను అనువాదాలు చేస్తున్నాను. పాఠకుల మెప్పు లభిస్తే చాలు, విమర్శకుల మెప్పు కూడ లభిస్తే అది బోనస్!

1 comments:

kasturimuralikrishna said...

my dear somasankar
thanks for concurring with me.the world not only wants a winner but wants to know his struggles,troubles,turmoils and travails.it wants to know how he over came them and emerged as a winner.that is why we read so many biographies of winners.we get inspired by them.we frame an idea of the hurdles we may encounter in our endeavour and take a leaf out from the lives of winners.show me your baby,i will tell you your future said a philospher.so baby is important.so also are the pains.