నేను ఇటీవలే ఉద్యోగం మారాను. మా హెడాఫీస్ ఢిల్లీ లో ఉంది. నన్ను Induction, orientation కోసం అక్కడికి రమ్మన్నారు. డిసెంబర్ ఒకటిన ఎపి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాను. ఢిల్లీకి వెళ్ళడం, 3rd AC లో ప్రయాణం చేయడం నాకు ఇదే మొదటిసారి! ఉదయం 6.40 కి సికిందరాబాద్ స్టేషన్‌లో ఎక్కాను. నా తోటి ప్రయాణీకులలో ఒక్కరికే తెలుగు వచ్చు. మిగిలిన వారంతా ఉత్తరాదివారే. వాళ్ళు కాక,ఇద్దరు ఇరాకీ డాక్టర్లు కూడా ఉన్నారు. ఇరాక్‌లో డిగ్రీ చేసి, పిజి కోసం హైదరాబాద్ వచ్చారు. వీరు హైదరాబాద్ గురించి, మన దేశం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకోడంతో మా సంభాషణ సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యలో, రైల్లో పాంట్రి సేవలు సరిగా లేవని ఎవరో చైన్ లాగడంతో సిరిపూర్ కాగజ్‌నగర్ దగ్గర రైలు దాదపు ఒక గంట సేపు ఆగిపోయింది. ఆ తర్వాత,ప్రయాణం సాఫీగా జరిగి, మర్నాడు ఉదయం 11 గంటలకి న్యూ ఢిల్లీ చేరాను. మిత్రుడు వినీత్ స్టేషన్‌కి వచ్చి, నన్ను Panch Sheel Enclave లోని తన బసకి తీసుకెళ్ళాడు.
అతడి రూంకి వెళ్ళి స్నానపానాదులు కావించుకుని, Dwaraka Sector 10లో ఉండే మా కజిన్ ఇంటికి వెళ్ళడానికి blue line బస్ ఎక్కాము. దారి మధ్యలో విపరీతమైన ట్రాఫిక్ జాం కావడంతో, బస్‌ని వదిలేసి ఆటో ఎక్కాం. దాదాపు గంటన్నర పట్టింది వాళ్ళింటికి చేరడానికి. పలకరింపులు, భోజనాలు అయ్యాకా, కబుర్లతో కాలక్షేపం చేసాం. సాయంత్రం టీ తాగి, అక్కడినుంచి మెట్రో రైల్లో కన్నాట్ ప్లేస్ (బారహ్ కంబా)చేరాము. అక్కడినుంచి ఆటో మాట్లాడుకుని, మా హెడాఫీసు చూడ్డం కోసం, IIT దగ్గర దిగాం. ఆక్కడినుంచి వినీత్ నేనూ కలసి నాలుగున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ చిరునామా ప్రకారం ఆఫీసు భవనాన్ని వెతుక్కుని 'అమ్మయ్య ' అని అనుకున్నాం. కాస్త పళ్ళరసం తాగి ఇంటిముఖం పట్టాం. ఆ మర్నాటి (అంటే మూడో తేదీ) నుంచి, గురువారం (ఆరో తేదీ) సాయంత్రం వరకు ఆఫీసు వ్యవహారాలతోనే సరిపోయింది.
ఈ నాలుగు రోజులలో ఓ కొత్త పదార్దాన్ని రుచి చూసాను. దాని పేరు momo. వెజ్, నాన్ వెజ్ రెందు రకాలలోను లభిస్తుంది. మైదా పిండిని ఉండలా చేసి, కొత్తిమీర, కాబేజి, పచ్చి బఠానీలు, పచ్చి మిరిపకాయల మిశ్రమాన్ని ఆ ఉండలో కూరి కుక్కర్‌లో కాసేపు ఉడికిస్తారు.కెచప్‌తో నంచుకుని తింటే చాల రుచిగా ఉంటుంది.
ఏడో తారీకు (శుక్రవారం) ఆఫీసులో సెలవు తీసుకుని ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాలు చూడగలిగాను.మొదటగా గ్రీన్ పార్క్ సమీపంలోని ఉపహార్ థియేటర్ చూసాను. ( ఈ థియేటర్ తగలబడి, కొందరు మృతి చెందిన కేసులో ఈ మధ్యే తీర్పు కూడా వచ్చింది). అక్కడినుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, AIIMS మీదుగా Dilli Haat చేరాను. అక్కడ కాసేపు గడిపి, లోధి రోడ్ దాటి సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్, మదరసా చూసి ఇండియా గేట్ చేరాను. ఆక్కడ్నుంచి తిన్నగా నడచి,రాష్ట్రపతి నిలయం, పార్లమెంట్ భవనం చూసాను. ఆ తర్వాత నార్త్ బ్లాక్‌లోని మా కజిన్ ఆఫీసుకి వెళ్ళాను. తనతో కాసేపు మాట్లాడాకా, అదే భవనంలో ఉన్న లైబ్రరీకి వెళ్ళాను. కాఫీ బోర్డు వారి వేడి వేడి కాఫీ తాగి, నేను తిరిగి నా బసకి బయల్దేరాను.అదేరోజు రాత్రి నా తిరుగు ప్రయాణం. అప్పటికింకా టికెట్ కన్‌ఫాం కాలేదు. మా కజిన్ సహాయంతో confirmation కోసం ప్రయత్నించాను. కాని చార్ట్ సిద్ధం కాకపోడంతో, కొంచెం ఆందోళన!ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఉంటే బాగుండేదేమోననే ఆలోచన బుర్రని దొలిచేయసాగింది. కాని ఓ అరగంట తర్వాత నాకు బెర్త్ కన్‌ఫాం అయ్యాకా, అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.
ఈ సారి నేను ఎక్కింది హజరత్ నిజాముద్దీన్ నుంచి బెంగుళూరు వెళ్ళే 'రాజధాని ఎక్స్‌ప్రెస్!' రాజధాని లో ప్రయాణించడం కూడా నాకు ఇదే మొదటిసారి. బండి సరైన సమయానికే ప్లాట్‌ఫాం మీదకి వచ్చింది. బయల్దేరడం కూడా సరిగ్గా నిర్ణీత సమయానికే (రాత్రి 8.50కి) బయల్దేరింది. ఈ దఫా నా చుట్టు పక్కలా తెలుగు వాళ్ళే ఉన్నారు. రాజస్థాన్‌కి చెందిన ఓ యువకుడు IPSకి సెలక్టై ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వస్తున్నాడు. సికిందరాబాద్‌లోని AOC Centreలో పనిచేసే ఓ యువ సిపాయిది నా పై బెర్త్. ఇతనిది హర్యానాలోని రొహ్‌తక్ ప్రాంతం. రైలు బయల్దేరిన ఓ పావుగంటకి వేడి వేడిగా సూప్ అందించారు పాంట్రీ వాళ్ళు.! అది తాగిన కొద్ది సేపటికే భోజనం వచ్చింది. ఈ కార్యక్రమం ముగించుకుని ఇక నిద్రపోదాం అని అనుకుంటున్న సమయంలో కొసరుగా 'ఐస్‌క్రీం ' సర్వ్ చేసారు. దాన్నీ లాగించి, హాయిగా నిద్రపోయాను.
శనివారం పొద్దున్నే ఐదుగంటలకి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్నాను. ఆరు గంటలకి మొదటి సారి టీ ఇచ్చారు. టీ బాగ్, పాలపొడి పాకెట్, చక్కెర పాకెట్‌లని ఒక చిన్న ట్రేలో పెట్టి ఇస్తే మొదట అర్ధం కాలేదు. ఆ తర్వత కప్పూ, వేడినీళ్ళు తెచ్చారు. ఎవరికి కావలసినట్లుగా వారు టీ కలుపుకోడానికా సౌకర్యమని అర్ధమైంది. టీ తాగాకా IPS ట్రైనీ తో మాట్లాడుతూ కూర్చున్నాను. 7.30కి ఓ ఆంగ్ల దినపత్రిక ఇచ్చారు. వార్తలు చదువుతూండగానే ఎనిమిది గంటలకి బ్రేక్‌ఫాస్ట్, మరో కప్పు టీ అందించారు. "అహా, బాగుంది రాజధాని భోగం" అనుకున్నాను.
ఆ తర్వాత ఓ గంటా గంటన్నర సేపు IPS ట్రైనీ తోనూ, సిపాయి తోను కబుర్లు చెబుతూ కూర్చున్నాను. కాసేపు ఓ చిన్న కునుకు తీసాను. మధ్యాహ్న భోజనం 1.30కి సర్వ్ చేసారు. అన్నం తిన్న తర్వాత 'ఐస్‌క్రీం ' షరా మామూలే!ఆ తర్వాత సాయంత్రం వరకు శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు రాసిన 'సర్వ సంభవం ' అనే పుస్తకాన్ని చదువుకున్నాను. ఐదు గంటలకి స్నాక్స్, నిమ్మరసం, టీ ఇచ్చారు. సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా 7.15కి సికింద్రాబాదు చేరాను. మిత్రులకి వీడ్కోలు పలికి ఇల్లు చేరాను. ఇదీ నా ఢిల్లీ ప్రయాణం కథా, కమామీషూ!
Thursday, December 13, 2007
Subscribe to:
Post Comments (Atom)

3 comments:
The way of description is good. I feel the font size is small. Thanks for sharing new things with us.
The way of decription is good. I feel the font size is bit small. Thanks for sharing new things with us.
సర్వ సంభవాం ఇంకా పూర్తి కాలేదా.. మంచి టపా ఇస్తారని ఎదురు చూస్తున్నాను. ఆ పుస్తకం నాకు బాగా నచ్చింది. దానికోసమయినా బ్లాగు ప్రారంభించాలని పించింది.
Post a Comment