Thursday, October 11, 2007

అమ్మమ్మ చదువు

అమ్మమ్మ చదువు
"How I Taught My Grand Mother to Read and Other Stories " అనే పేరుతో శ్రీమతి సుధామూర్తి గారు రాసిన ఈ పుస్తకానికిది తెలుగు అనువాదం. ' ఇన్ఫోసిస్ ఫౌండేషన్' ఛైర్‌పర్సన్ గా అందరికీ తెలిసిన శ్రీమతి సుధామూర్తి గారు రచయిత్రి గాను సుప్రసిద్ధులు.
ఈ సంపుటిలో తను చిన్ననాడు విన్న కథలతో, తన జీవితానుభవాలను జోడించి కొత్తగా కథలు అల్లారు సుధామూర్తి. వీటి వెనుక మానవత్వంతో స్పందించే సహృదయత ప్రస్ఫుటమవుతుంది. ఇవి చదువరులకు గొప్ప ప్రేరణనిస్తాయి. కొన్ని కథలను ఉదహరిస్తాను. 'ఎర్ర బియ్యం' కథ అద్భుతమైంది. " ఎప్పుడైనా, ఎవరికైనా, ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు నీకున్న చాలా మంచిదాన్ని ఇవ్వాలి. తక్కువ రకం వాటిని ఇవ్వకూడదు'' అంటారు రచయిత్రి అమ్మమ్మ ఆ కథలో.
" ఈ సాయంత్రానికి, రేపుదయానికి మధ్య చాలా వ్యవధి ఉంది. జీవితం అనిశ్చితం. ఏదైనా జరగవచ్చు. ఏమైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇవ్వాలి. కాలం మన చేతుల్లో ఉండదు'' అంటాడు బాలు, 'బాలు కథ'లో. ఈ సంభాషణ మహాభారతంలో ధర్మరాజుకీ, భీముడికి జరిగిన చర్చని గుర్తు చేస్తుంది. 'పెద్ద తప్పు' కథ నేటి కార్యాలయాలలో ఎదురయ్యే అనేక సమస్యలకి సులువైన పరిష్కారం సూచిస్తుంది. "రోజులో చాలా కాలం మనం పనిచేసే చోట్లోనే ఉంటాం. ఆ సమయం సంతోషంగా గడపాలి. ఒకర్నొకరు దూషించుకుంటూ కాదు.'' అంటారు రచయిత్రి. 'హోరెగల్లు' కథ ఈ సంపుటిలోని అన్ని కథలకంటే విశిష్టమైనది. మనిషికి చెవులెందుకో ఈ కథ చెబుతుంది. "దేవుడు రెండు చెవులిచ్చాడు. అవి బంగారం, ముత్యాలు, వజ్రాలతో అలంకరించుకునేందుకు కాదు. ఎవరైనా తమ కష్టాలు చెప్పుకుంటుంటే సానుభూతితో వినేందుకు. మానసిక ఉద్రేకంతో, వ్యతిరేక భావనలతో ఉన్న వాళ్ళు ఎవరిముందన్నా వాటన్నింటినీ వెళ్ళగక్కి బరువుదించుకుంటారు. మనం వాళ్ళ మాటలు వినాలి. ఈ విధంగా వాళ్ళు నివారణ పొందినట్లు అనుభూతి పొందుతారు. వాళ్ళకి సంతోషం కలుగుతుంది'' అని చెబుతారు రచయిత్రి. ఒకరి సొంత విషయాలు మరొకరితో చెప్పకుండా జాగ్రత్త వహించాలని కూడ సూచిస్తారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా ఆహ్లాదంగా మార్చుకోవచ్చో, 'నీ చేతుల్లోనే నీ స్వర్గం' కథలో చెబుతారు. 'పెళ్ళి' కథలో భార్యాభర్తలని కలిపి ఉంచేది పరస్పర విశ్వాసమని, నమ్మకం ఒకటే పెళ్ళికి మంచి పెట్టుబడి అని, వజ్రాలు కాదు, డాలర్లు కాదని రచయిత్రి చెపుతారు. 35 కథలున్న ఈ పుస్తకాన్ని హాయిగా ఏకబిగిన చదివేయచ్చు. ఈ పుస్తకం కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ భాషలలో కూడ అనువదించబడింది. ఈ పుస్తకాన్ని శ్రీ ద్వారక (శ్రీ సి. హెచ్. వెంకటరత్నం) గారు తెలుగులోకి అనువదించారు. దీన్ని విజయవాడకి చెందిన అలకనంద ప్రచురణలు వారు ప్రచురించారు. వెల రూ.80/-. అన్ని పుస్తక విక్రయ కేంద్రాలలోను లభ్యం.

0 comments: