ఆనంద రావ్ పట్నాయక్ రాసిన కథల సంకలనమింది.
ప్రచురణకర్త మాటలలో చెప్పినట్లు మధ్య తరగతి జీవితాలలో నిత్యం జరిగే చిన్న చిన్న సంఘటనలతో అల్లిన కథలివి. అచ్చులో మహా అయితే రెండు పేజీలుంటాయి. 32 కథలున్న ఈ పుస్తకంలో అన్ని కథలు చదివిస్తాయి.
లంచాలు తీసుకోడం మానేయాలని ఓ ప్రభుత్వోద్యోగి ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఈ వ్యవస్థలో అది సాధ్యమేననుకున్నాడా?...తెలుసుకోవాలంటే 'అతని కంటే ఘనుడు ' కథ చదవాలి.
మందు కన్నా, వైద్యుడి హస్తవాసిపై విశ్వాసమే రోగాన్ని నయం చేయడంలో తోడ్పడుతుందని 'నమ్మకం ' కథ చెబుతుంది.
విషయ పరిజ్ఞానం లేని అధికారి ఓ రైతుకి వ్యవసాయంపై ఎలాంటి సూచనలు, సలహాలిచ్చాడు, వాటికి ఆ రైతు ప్రతిస్పందన ఏమిటో 'తోట ' కథ చెబుతుంది.
తన సొమ్ములో ఒక రూపాయి మిగుల్చుకుని, ఇతరుల డబ్బుతో తన కోరిక తీర్చుకోవాలనుకున్న చిద్విలాస్ కి ఎదురైన సంఘటన తెలుసుకోవాలనుకుంటే 'ఆశ ' కథ చదవాలి.
హోదా పెరగగానే, తన సహోద్యోగులపై అధికారులు ఎలా గొప్పలు పోతారో 'డాంబికం ' అనే కథలో చెప్పారు రచయిత.
మత ఛాందసుల బారి నుంచి ఓ పురాతన కళాఖండాన్ని ఓ క్యూరేటర్ కాపాడిన తీరుని 'రుబ్బురోలు ' కథలో చదవచ్చు.
ఇది రచయిత రెండో కథా సంపుటి. చిన్న చిన్న కథలు ఎన్నెన్నిఅల్లినా, వాటి ఇతివృత్తాలు విభిన్నంగా ఉండడంవల్ల ఈ 107పేజీల పుస్తకాన్ని హాయిగా ఏకబిగిన చదివేయచ్చు.
ఈ పుస్తకాన్ని 'జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు ' వారు జూలై 2007 లో ప్రచురించారు. ఈ పుస్తకం నవయుగ, నవోదయ, ప్రజాశక్తి వంటి అన్ని పుస్తకకేంద్రాలలోను దొరుకుతుంది. వెల 50 రూపాయలు.
Sunday, September 23, 2007
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment