Sunday, July 22, 2007

పచ్చ నాకు సాక్షిగా...

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన పుస్తకమిది. దీంట్లో మూడు భాగాలున్నాయి. 1.పచ్చ నాకు సాక్షిగా 2. సినబ్బ కతలు 3. మిట్టూరోడి కతలు. బాపు గారి బొమ్మలతో 1999 లో విడుదలైన ఈ పుస్తకం ఖరీదు 100 రూపాయలు. విశాలాంధ్ర వారి అన్ని శాఖలలోను లభిస్తుంది. మొదటి భాగం లోని కధలు రచయిత బాల్యాన్నీ, వాళ్ళ అమ్మ ఆప్యాయతని పాఠకులకి రుచిచూపిస్తాయి. " తప్పమ్మా తప్పు. వొరసబెట్టి శాడీలు సెప్పడం తప్పు" అంటూ పిలగాడికి నీతి చెబుతుందా తల్లి 'ఎర్రటి ఎండలో మా అమ్మ కడుపు ' అనే కధలో. పేదరికం కారణంగా పిల్లలకి కడుపు నిండాఆ అన్నం పెట్టలేక పోతున్న ఓ తల్లి బాధని చాలా ఆర్ధ్రంగా వ్యక్తీకరుస్తాయి - ఇదంతా నా కడుపు మంట, మా ఇంట్లో మాంసం కూర కధలు. పిలగాడికీ, మొగుడికీ బాధ్యత నేర్పడానికి ప్రయత్నిస్తుందామె - మా పగోళ్ళు ఎన్ను మీది గువ్వలు కధలో. తల్లి బాధలకి పిల్లగాడు ఏడస్తా వుంటే, "నా అక్కుసు దేముడితో చెప్పుకుంటా వుంటే, నువ్వెందుకురా ఏడ్చేది?" అంటుందా తల్లి - ఏడుపు పాట మా అమ్మది కధలో.రెండో భాగంలోని సినబ్బ కతలు రచయిత కౌమార దశలోని సంఘటనలతో అల్లినవి. స్కూలికి స్టీలు కారియర్ కొనివ్వమని గొడవజేసే పిల్లాడితో "ఏమి నాయనా, నువ్వు సత్తు కేరీరులో అన్నం కట్టుకోని పోతే నీకు తల గుడ్డ నేల పడిపోతుందా?చదువుకునే పిలగోడికి బడాయి వుండకూడదురా తండ్రీ " అంటుంది వాళ్ళమ్మ 'తంతే తలకోనలో పడతావు ' కధలో. "మన సొత్తు ఎవడెవడో తినేసి పోతుండాడు గదా. వాళ్ళల్లో సిడిజిర్లాండోడు ఒకడు. వోడు మన తమ్ముడో గాదో!దొంగ మొకం నా బట్ట!" అని తిట్టుకుంటారు ముగ్గురు అక్కచెల్లెళ్ళు, తమ్ముడినని చెప్పి, లక్షలిస్తానని మభ్యపెట్టి, వాళ్ళ ఇళ్ళలో తెగతిని వెళ్ళిపోయిన ఓ మనిషిని ' మా సిడిజిర్లాండోడి వైబోగం ' కధలో.మూడో భాగంలోని మిట్టూరోడి కధలు రచయిత, ఉద్యోగిగా మారాక, అప్పటి అనుభవాలతో అల్లిన కధలు. ఒకరి పరోక్షంలో వారి గురించి చెడుగా మాట్లాడితే, మన పరోక్షంలో మన గురించి కూడా అంతే చెడుగా మాట్లాడుకుంటారనే సత్యాన్ని చెబుతుంది 'కుచ్చుంటే కత, లేస్తే కత ' అనే కధలో. ఓ కుటుంబంలో వయసైపోయిన ముదుసలి ఉంటుంది. 'ఇంకా నువ్వు బతికి ఏం లాభం? హాయిగా చచ్చిపోరాదా ' అని రచయిత ఆమెతో హాస్యమాడితే ఆ ముసలామె చెప్పిన జవాబు కోసమైన ' మా రామాస్తానం ఎందుకు బతుకుతా వుందంటేనంటే ' అనే కధ చదివితీరాల్సిందే. మూడో భాగంతో పోలిస్తే మొదటి రెండు బాగున్నాయి. మొత్తం మీద కళ్ళను, గుండెని చెమ్మగిల్లేలా చేసే పుస్తకమిది.

0 comments: